ప్రేమ పేరుతో వంచన... స్నేహితులకు ప్రియురాలినే అప్పగించాడు
ప్రేమించి, మోసం చేసి ఓ యువతి జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని సూళిత్తురై సమీపంలోని పాంకోడు కాలనీకి చెందిన ప్రీజిత్ అలియాస్ సురేష్ (27) ఓ కాలేజీలో వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిలను కాలేజ్ కి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఇంటికి చేర్చడం అతని పని. ఈ క్రమంలో, డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై ప్రేమ వల విసిరాడు. అతను చెబుతున్న మాటలను నమ్మిన ఆ యువతి, ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఉన్న నగలను తీసుకొని, అతనితో పాటు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలసి పర్యాటక ప్రాంతాలు తిరిగారు. ఈ క్రమంలోనే ఆమెపై అతను అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఆమెను నాగర్ కోవిల్ కు తీసుకెళ్లి, లాడ్జీలో దిగాడు. తన ముగ్గురు స్నేహితులను కూడా అక్కడకు రప్పించాడు. పెళ్లి ఏర్పాట్లు అని చెప్పి, ఆమె వద్ద ఉన్న నగలను తీసుకుని, ముగ్గురు స్నేహితులను గదిలోకి పంపించాడు. ఆ తర్వాత ముగ్గురు యువకులతో ఓ యువతి గొడవపడుతోందంటూ సమాచారం అందడంతో, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన యువకులు పరారయ్యారు. తనను సురేష్ మోసం చేశాడని, తనపై సామూహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె ఇచ్చిన వివరాల మేరకు, వ్యాన్ డ్రైవర్ సురేష్, అతని స్నేహితులు గోపాల్, దినేష్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.